ఎన్నికల కోసం తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఏడాది ముందు మేనిఫెస్టో ప్రకటించటమే పెద్ద సంచలనం. టిక్కెట్ లు అయినా...మేనిఫెస్టో అయినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఉండటం అనేది ఇప్పటివరకు చంద్రబాబు స్టైల్. అలాంటిది ఇప్పుడు ఇంత తొందరగా..మహానాడు వేదికగా తొలిదశ మేనిఫెస్టో ప్రకటించటం అన్నది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సంక్షేమ బాట పట్టక తప్పదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు ఈ మేనిఫెస్టో చూస్తే తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు కూడా సీఎం జగన్ బాటలో నడవటానికి నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏళ్ళు ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇది వర్తిస్తుంది అని తెలిపారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని వెల్లడించారు.తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు 15 వేలు ఇస్తామని ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తామని ప్రకటించారు.
యువగళం కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు అందిస్తామని వెల్లడించారు. రైతుల కోసం అన్నదాత కార్యక్రమం పేరుతో ప్రతి ఏటా 20 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. హామీలు అయితే పెద్ద ఎత్తున ఇచ్చారు కానీ చంద్రబాబు ప్రకటించిన వాటిని ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు..వాటిని నమ్మేలా చేయటమే ఇప్పుడు టీడీపీ ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు పలు హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయటంలో విఫలం అయ్యారు. ఇంత ముందు హామీలు ఇవ్వటం ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది...అదే సమయంలో ప్రజలకు వాటిపై విశ్వాసం కల్పించటంలో టీడీపీ ఒకింత కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాలి. టీడీపీ నేతలు మాత్రం మహానాడు విజయం..ఇంత ముందుగా హామీలు ప్రకటించటంతో మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు అని చెప్పొచ్చు.