ఏపీలో మున్సిపల్ ఎన్నికల వ్యవహారం మరింత వేడేక్కనుంది. తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్వయంగా ఈ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల తరహాలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. అందుకే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్లుండి నుంచి చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 4 నుంచి 8 వరకు 5 రోజుల పాటు చంద్రబాబు పలు జల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ నెల 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో, 6న విశాఖ జిల్లాలో, 7న విజయవాడలో, 8న గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు.