పోలవరంలో తాము అవినీతి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. పోలవరం పేరుతో వైసీపీ నేతలు నీచమైన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టకపోయి ఉంటే మరింత ఆలశ్యం అయి ఉండేదని చంద్రబాబు తెలిపారు. '' వైఎస్ కంటే ముందు పోలవరానికి అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు. వైఎస్ హయాంలో పోలవరం కాలువలు తవ్వారు. తప్పుడు సమాచారంతో కాలయాపన చేస్తున్నారు. పోలవరం విషయంలో కాలయాపన చేయొద్దు. కేసుల కోసం భయపడితే చరిత్ర హీనులు అవుతారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తారా?. రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రానికి భారీ నష్టం.'' అని చంద్రబాబు విమర్శించారు. నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్ట్ ఏం చేసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆరోపణలు చేసేముందు ఆలోచించి చేయాలని, అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని ఆయన విమర్శించారు. ''16 జాతీయ ప్రాజెక్ట్ ల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. పోలవరం కాంట్రాక్ట్ ను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు?. ఆర్‌అండ్‌ఆర్ ఇవ్వకుండా పవర్ ప్లాంట్ ఎందుకు?. విభజన బాధలో పోలవరం ప్రాజెక్ట్ మనకు వచ్చింది. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 70శాతం పూర్తైంది. కనీసం రోడ్లకు గుంతలు పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.
పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో సమాధానం చెప్పండి. ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచేసి నెపం మాపై నెడతారా?. పోలవరంలో ఏడాదిన్నరగా మీరు ఏం చేశారు?. తప్పుడు పనులు మీరు చేసి మాపై ఆరోపణలా?. వైసీపీ నేతలు నిధులు తెచ్చుకోలేక ఇతరులపై ఏడుస్తున్నారు. సీఎం జగన్ వచ్చాక సాగునీటి ప్రాజెక్ట్ లకు గ్రహణం పట్టింది. ఒక్క ప్రాజెక్ట్ పై ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. సీఎం జగన్‌కు సంస్కారం లేదు.. సభలో ఇష్టానుసారం మాట్లాడారు.'' అని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందా? లేదా అన్న అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. టీడీపీ అంచనాలు ఖరారు చేసినప్పుడు అవినీతి అంటూ ఆరోపించి ఇప్పుడు వాటినే ఆమోదించాలని కోరుతున్నానని ఎద్దేవా చేశారు.