ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ లు చేస్తున్న యుద్దానికి సంబంధించి రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన వచ్చినా కూడా ఇంకా పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణమే నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అనే చెప్పొచ్చు. మరో వైపు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా కవ్వింపు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇరాన్ కు ఆయుధాలు విక్రయించే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే డోనాల్డ్ ట్రంప్ ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. మరో వైపు ఇజ్రాయెల్ లెబనాన్ పై భయంకరంగా దాడులు చేస్తోంది. బుధవారం నాడు పది నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున దాడులు చేయటంతో ఏకంగా 115 మందికిపైగా పౌరులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు కూడా ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
మరో వైపు కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ విషయం కూడా ఉంది అని..ఇలా అయితే తాము తిరిగి హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు అమెరికా, ఇజ్రాయెల్ లు కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ విషయం లేదు అని చెపుతున్నాయి. ఇజ్రాయెల్ గత రెండు రోజులుగా లెబనాన్ పై దాడులు చేస్తుండటంతో టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది. దీంతో మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందా అన్న భయం పలు దేశాల్లో కనిపిస్తోంది. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ కాల్పుల విరమణ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం లెబనాన్ లో కూడా కాల్పుల విరమణ ఉంటుంది అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వరుసపెట్టి లెబనాన్ పై దాడులకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్ భవిష్యత్ లో అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని ఏ మాత్రం అనుమతించం అన్నారు.
ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనికులు, ఆయుధాలు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు సైనికులు వెనక్కి రారని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి మార్గం సురక్షితంగా ఉండాలని, నౌకాయానం నిరంతరం కొనసాగాలని అన్నారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా సైన్యం అక్కడే విశ్రాంతి తీసుకుంటూ, తమ తదుపరి మిషన్ కోసం ఎదురుచూస్తుందన్నారు. అటు అమెరికా, ఇటు ఇరాన్ కూడా రకరకాల ప్రకటనలు చేస్తుండంతో అంతా గందరగోళంగా మారింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.