బిజెపి జాతీయ ప్రెసిడెంట్ జె పీ నడ్డా మంగళవారం నాడు తెలంగాణ సర్కారుపై చేసిన విమర్శలపై అధికార టీఆర్ఎస్ మండిపడింది. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కెసీఆర్ అవినీతికి ఏటీఎంలా మారింది అంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జె పీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ లో బీజేపీ ఒక లోక్ సభ సీటు తో పాటు మూడు అసెంబ్లీ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోయిందని ఎద్దేవా చేశారు. నడ్డా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. సొంత రాష్ట్రం లో బీజేపీ ఓడిపోవడం తో నడ్డా మతి స్థిమితం కోల్పోయాడన్నారు. బీజేపీ సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ గా మారిందని ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్ళతోనే నడ్డాకు స్నానం చేపిస్తామని, బండి సంజయ్ కు అదే స్క్రిప్ట్ అమిత్ షా, నడ్డా లకు ఒకే స్క్రిప్ట్ రాసి బీజేపీ నేతలు అభాసు పాలయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే పార్లమెంటు లో సమాధాన మిచ్చిందని తెలిపారు.
కాళేశ్వరం పై అడ్డదిడ్డంగా మాట్లాడిన నడ్డాను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆస్పత్రి లో చేర్చాలన్నారు. బీజేపీ ఏ టు జడ్ స్కాం ల పార్టీ అని, ఇంగ్లీషు లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నీ కుంభ కోణాలు చేసిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. నాడ్డా నక్రాలు ఆపు... తెలంగాణ లో నిన్ను నమెందుకు బక్రాలు ఎవ్వరూ లేరు అంటూ మండిపడ్డారు. అరవింద్.. తప్పుడు కూతలు మానుకో. ఇక ఆట మొదలైందన్నారు. బండి సంజయ్ ఓ క్రిమినల్ అని ఆరోపించారు. ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా...అరెస్టు చేస్తే కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు అని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో బీజేపీ నేతల దుర్భషలు ఎక్కువ అవుతున్నాయని, పోలీసులు ఇక కఠినంగా వ్యవహరించాలన్నారు. నడ్డా ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని గ్రహించాలని వ్యాఖ్యానించారు. .గాడ్సే లను మెచ్చుకుంటున్న వారు గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లడం సిగ్గు చేటు అని, బీజేపీ కి దేశ వ్యాప్తంగా గడ్డు రోజులు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు.