తెలంగాణ అసెంబ్లీలో 'బిజెపి ఆర్ఆర్ఆర్' ఎంట్రీ

Update: 2022-03-07 06:19 GMT

ఆర్ఆర్ఆర్. ఇది సినిమా కాదు. బిజెపి ఎమ్మెల్యేల పేర్ల‌తో కొద్ది రోజుల క్రితం తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు. రాజేంద‌ర్, రాజాసింగ్, ర‌ఘునంద‌న్ రావు లు అసెంబ్లీలో టీఆర్ఎస్ స‌ర్కారుకు చుక్క‌లు చూపిస్తారంటూ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పిన‌ట్లే హుజూరాబాద్ లో ఈటెల రాజేంద‌ర్ అప్ర‌తిహ‌త విజ‌యం సాధించ‌టం అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ ఎంట్రీకి మార్గం సుగ‌మం అయింది. సోమ‌వారం నాడు ప్రారంభం అయిన తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కూ ఈ ఆర్ఆర్ఆర్ న‌ల్ల కండువాల‌తో అడుగుపెట్టారు. అంత‌కు ముందు వీరు అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించారు. అసెంబ్లీలో తాము ముగ్గుర‌మే ఉన్నా..ప్ర‌జ‌లు మాత్రం త‌మ వైపే ఉన్నార‌ని మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు.

బిజెపి ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత ఆయ‌న స‌భ‌కు భారీ ఎత్తున అనుచరుల‌తో క‌ల‌సి రావాల‌ని ఏర్పాట్లు చేసుకోగా..పోలీసులు ఈ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకున్నారు. చివ‌ర‌క‌కు పోలీసులే కాన్వాయ్ పెట్టి ఈటెల రాజేంద‌ర్ ఒక్క‌డిని అసెంబ్లీకి తీసుకొచ్చారు. గ‌న్ పార్క్ వ‌ద్ద ఈటెల మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా చేయ‌టం ద్వారా సీఎం కెసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించార‌ని ఆరోపించారు. ఆయ‌న‌కు సీఎం ప‌ద‌విలో కొన‌సాగే అర్హ‌త‌లేద‌న్నారు. బంగారు తెలంగాణ పేరుతో కెసీఆర్ అరాచ‌కాలు చేస్తున్నార‌ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ విమ‌ర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింద‌ని ర‌ఘునంద‌న్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

Tags:    

Similar News