నడ్డా వాహనంపై దాడి..కలకలం

Update: 2020-12-10 14:48 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఎంసీ, బిజెపిల మధ్య ఫైట్ పీక్ కు చేరుతోంది. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎలాగైనా ఈ సారి ఇంటికి పంపాలని బిజెపి, బిజెపిని ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చూడాలని మమతా బెనర్జీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్నో ఉల్లంఘనలు..అడ్డగోలు ప్రకటనలు..దాడులు జరుగుతున్నాయి. బిజెపి యమ దూకుడు చూపిస్తుంటే..అధికార టీఎంసీ మాత్రం అంతే స్పీడ్ గా దాడులు చేస్తోంది. గురువారం నాడు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనంపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొంత మంది రాళ్ళు, కర్రలతో దాడి చేసి అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్ననడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్‌ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడమే కాక రోడ్డు బ్లాక్‌ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) నేతల ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆరోపించారు. టీఎంసీ నేతలు జేపీ నడ్డాను చంపాలని ప్రయత్నించారని, బుల్లెట్ ప్రూఫ్‌ కారు ఉంది కాబట్టే ఆయన బతికి బయట పడ్డారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News