పవన్ సినిమా కోసం కూడా బిజెపి పోరాటం

Update: 2021-04-09 14:57 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రభావం. బిజెపి పవన్ కళ్యాణ్ విషయంలో అకస్మాత్తుగా ప్రేమ ఒలకపోస్తోంది. ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే ఏకంగా పవన్ ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోమన్నారు అంటూ సెలవిచ్చారు. అంతే కాదు..తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పవన్ ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవటమే కాదు..పవన్ సినిమా విషయంలో కూడా బిజెపి అలాగే చేసింది. ఏకంగా ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ పవన్ సినిమా కోసం నిరసనలు వ్యక్తం చేయటం విశేషం. అంతే కాదు..'ప్రతి శుక్రవారం కోర్టు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా. వకీల్ సాబ్ ను చూసి భయపడేది' అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఏపీలో బెనిఫిట్ షోలను రద్దు చేయటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు పవన్ కళ్యాణ్, ఆయన సినిమాలు అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ఇది ఏ మాత్రం అమోదయోగ్యం కాదంటూ విమర్శలు గుప్పించారు. సునీల్ దియోదర్ తోపాటు మరికొంత మంది బిజెపి నేతలు కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. అయితే ఇఫ్పటి వరకూ అన్ని సినిమాలకు బెని ఫిట్ షోలకు అనుమతి 'వకీల్ సాబ్' దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వం తన వైఖరి మార్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అయితే అధికార వైసీపీ కూడా బిజెపి విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. ఏపీలోని థియేటర్లలో నాలుగు షోలకే అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వకీల్ సాబ్ టిక్కెట్ల ధరల విషయంలో బిజెపి ఆందోళన చేయటం విచిత్రంగా ఉందన్నారు. తిరుపతి ఎన్నికలకు వకీల్ సాబ్ సినిమాకు సంబంధం ఏమిటన్నారు. వకీల్ సాబ్ ను చూసి జగన్ భయపడుతున్నారని అంటారా? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. సోహ్రబుద్దీన్ కేసులో అమిత్ షా ఎవరికి భయపడుతున్నారని ఫ్రశ్నించారు. పువ్వుకు ఓటేయమని ప్రజల చెవుల్లో పూలు పెడతారా? అంటూ బిజెపిపై మండిపడ్డారు.

Tags:    

Similar News