ప‌నిచేయ‌ని కెసీఆర్ ఆత్మ‌ప్ర‌భోదం పిలుపు..ముర్ము ఘ‌న విజ‌యం

Update: 2022-07-21 15:48 GMT

తొలి ప్ర‌యత్నంలోనే కెసీఆర్ కు షాక్!

Full Viewటీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ జాతీయ స్థాయిలో చేసిన తొలి ప్ర‌య‌త్న‌మే దారుణంగా దెబ్బ‌కొట్టింది. ఇది ఆయ‌న‌కు భారీ షాకే. అస‌లు అప్ప‌టివ‌ర‌కూ విప‌క్ష పార్టీల త‌ర‌పున బ‌రిలో నిలిచిన య‌శ్వంత్ సిన్హా నే ఆత్మప్ర‌భోదానుసారం ఓటు వేయాల‌ని పిలుపునివ్వ‌లేదు. కానీ ఆయ‌న త‌ర‌పున టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కెసీఆర్ మాత్రం య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ వ‌చ్చిన స‌మ‌యంలో భారీ ర్యాలీ నిర్వ‌హించి..ఒక్క మాట‌లో చెప్పాలంటే విజ‌యోత్స‌వ స‌భ‌లా జ‌రిపారు. ఈ స‌మావేశాన్ని సీఎం కెసీఆర్ జాతీయ స్థాయిలో ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేసుకునేందుకు బాగానే వాడుకున్నారు. అంటే ఆయ‌న వాయిస్ పంపించేందుకు ప‌నికొచ్చింది త‌ప్ప‌..రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో య‌శ్వంత్ సిన్హాకు అద‌నంగా ఓట్లు సంపాదించేందుకు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేద‌నే విష‌యం తాజా ఫ‌లితాల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతోంది. కెసీఆర్ ఆత్మ‌ప్ర‌భోధానుసారం ఓటు వేయాల‌ని పిలుపునిస్తే కెసీఆర్ పిలుపును పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌నే విష‌యం తాజా ఫ‌లితాల‌ను చూస్తే స్ప‌ష్టం అవుతోంది. జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చ‌క్రం తిప్పుదామ‌ని చూస్తున్న ఆయ‌న ఇది ఓ ర‌కంగా తొలి షాక్ వంటిద‌నే అభిప్రాయంం వ్య‌క్తం అవుతోంది. అధికార ఎన్డీయే ప్ర‌తిపాదించిన ద్రౌప‌ది ముర్ము గెలుపు పెద్ద క‌ష్టం కాబోద‌నే విష‌యం రాజ‌కీయాల‌పై ఏ మాత్రం అవ‌గాహ‌న ఉన్న‌వారెవ‌రైనా ఊహించ‌గ‌లిగిన విష‌యమే.

ఎందుకంటే కార‌ణాలు ఏమైనా వైసీపీతోపాటు బిజెడి వంటి పార్టీలు ఎన్డీయే అభ్య‌ర్ధికే మ‌ద్ద‌తు ఇస్తార‌ని విష‌యం ముందు నుంచే ప్ర‌చారంలో ఉంది. చివ‌ర‌కు అదే జ‌రిగింది. అయితే బిజెపి ప్ర‌తిపాదించిన అభ్య‌ర్ధి గెలుస్తారు అన్న విష‌యం తెలిసినా కూడా పోటీలేకుండా ఏక‌ప‌క్షంగా బిజెపికి ఎందుకు గెలుపు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్ర‌తిప‌క్ష పార్టీలు అభ్య‌ర్ధిని బ‌రిలోకి దింపాయి. అంతే త‌ప్ప‌..ఖ‌చ్చితంగా గెలుస్తార‌నే ధీమాతో కాద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కేంద్రంలో అధికారం చ‌లాయిస్తున్న మోడీ సర్కారు ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయాల‌ను తుంగ‌లో తొక్కి ..అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నందున ఆ పార్టీ అభ్య‌ర్ధికి ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్దతు ఇవ్వ‌టం అన్న‌ది జ‌రిగే ప‌ని కాదు. అందుకే బిజెపి దేశంలోనే తొలిసారి ఓ గిరిజ‌న మ‌హిళ‌ను బ‌రిలోకి దింపినా ప్ర‌తిప‌క్ష పార్టీలు ఓట‌మి త‌ప్ప‌ద‌నే విష‌యం తెలిసినా య‌శ్వంత్ సిన్హాను బ‌రిలోకి దింపాయి. ఇదే బాట‌లో టీఆర్ఎస్, సీఎం కెసీఆర్ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ..ఓట్లు వేసి ఉంటే స‌రిపోయేదని..అలా కాకుండా కెసీఆర్ స్వ‌యంగా ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓట్లు వేయాల‌ని పిలుపునిచ్చి ప‌రువు తీసుకున్న‌ట్లు అయింద‌నే అభిప్రాయం టీఆర్ఎస్ నేత‌ల్లో కూడా వ్య‌క్తం అవుతోంది.

Tags:    

Similar News