సంచలనం. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఈ కుట్రను చేధించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సైబరాబాద్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేయటంతోపాటు హత్యకు ప్లాన్ చేసిన వారిని అరెస్ట్ చేశారు. 12 కోట్ల రూపాయలకు సుపారీ గ్యాంగ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. హత్యకు ప్లాన్‌చేసిన నిందితులను పేట్‌బషీరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా శ్రీనివాసగౌడ్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ఇటీవల కిడ్నాప్ లు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం నుంచి కొంత మందిని కిడ్నాప్ చేశారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులో మంత్రి అనుచరుల పాత్ర ఉందనే తరహాలో ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఇప్పుడు మంత్రి హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి మంత్రి శ్రీనివాసగౌడ్ తొలుత అప్ లోడ్ చేసిన దానిలో మార్పులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. శ్రీనివాస గౌడ్ సోమవారం రాత్రి సీఎం కెసీఆర్ తో కలసి ఢిల్లీ వెళ్లారు.