బెర్నీ శాండర్స్ సంచలనం

Update: 2020-11-05 16:45 GMT

బెర్నీ శాండర్స్. ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి రెండు రోజులు అయినా సరే ఫలితాలపై అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఫలితాలపై ఉత్కంఠ సాగుతోంది. డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ తొలి నుంచి ముందంజలో ఉన్నా...మ్యాజిక్ ఫిగర్ కు మాత్రం చేరుకోవటంలేదు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా వెనకబడి ఉన్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఫలితాలు మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ తరుణంలో అమెరికా ఎన్నికల వ్యవహారం అంతా అచ్చం బెర్నీ శాండర్స్ చెప్పినట్లుగానే సాగుతోంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు..ఆయన పాత వీడియోను చూస్తున్నారు. డెమాక్రటిక్ నేత బెర్నీ శాండర్స్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఫలితాలు ఎలా ఉండబోతున్నది స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారనే అంశాలకు సంబంధించి ఏమి చేస్తారో కూడా ఆయన చెప్పారు. ఈసారి ఊహించని స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు వస్తాయని చెప్పారు. దాని వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని కూడా ముందే ఊహించారు ఆయన. 'పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు వస్తాయి. ఫ్లోరిడా, వెర్మోంట్ లాంటి రాష్ట్రాల్లో వాటిని లెక్కించడం అంత సులువు కాదు. ఎన్నికల రోజు, ఆ తర్వాత రోజు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది.' అని బెర్నీ సాండర్స్ చెప్పారు. ఆయన ఇంకో విషయాన్ని కూడా అంచనా వేశారు. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి. 'ఎన్నికల రోజు రాత్రి పది గంటలకు ట్రంప్ బయటకు వస్తారు.

మిచిగాన్‌లో గెలిచాం. పెన్సిల్వేనియాలో గెలిచాం. విస్కాన్సిన్‌లో గెలిచామని ప్రకటించినా ప్రకటించవచ్చు. తనను రెండోసారి ఎన్నుకున్నందుకు అమెరికన్లకు థాంక్స్ కూడా చెప్పొచ్చు.' అని బెర్నీ సాండర్స్ చెప్పారు. ఆయన అంచనా వేసిన రెండు అంశాలు కచ్చితంగా అలాగే జరిగాయి. ఆయన చెప్పిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. దీని వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా సాండర్స్ చెప్పినట్టే ఎన్నికల రోజు రాత్రి 11 గంటలకు బయటకు వచ్చి తనను మరోసారి ఎన్నుకున్నందుకు థాంక్యూ అంటూ అమెరికన్లను ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు.

Tags:    

Similar News