బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. తెలంగాణలో ఉద్యోగుల బదిలీల తీరును నిరసిస్తూ సంజయ్ ఆదివారం నాడు రాత్రి దీక్షకు పూనుకున్నారు. అయితే అక్కడ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఎత్తున బిజెపి నేతలు, కార్యకర్తలు చేరారనే కారణంతో పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ సమయంలోనే తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అరెస్ట్ చేసిన బండి సంజయ్ ను సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చగా..న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు.
అయితే కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ నిరాకరించటంతో ఆయన్ను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ అరెస్ట్..అనంతరం జరిగిన పరిణమాలపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. బిజెపి జాతీయ ప్రెసిడెంట్ జె పి నడ్డా కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరంకుల విధానాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు.