కెటీఆర్ ను సీఎం చేయాలని ప్రగతిభవన్ లో టీవీలు పగులుతున్నాయి

Update: 2021-01-20 10:50 GMT

ఉద్యమకారులకు కెటీఆర్ సీఎం కావటం ఇష్టం లేదు

కెసీఆర్ పూజలు కుటుంబం కోసమే..సమాజ హితం కోసం కాదు

ఇప్పటికైనా దళితుడిని సీఎం చేయాలి

కాళేశ్వరం పర్యటన ఉద్దేశం అదే

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అధికార టీఆర్ఎస్ లోని మంత్రులు...ఎమ్మెల్యేలు ఒక్కొర్కుగా సీఎం అయ్యేందుకు మంత్రి కెటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ అయితే తాజాగా ఇప్పటికే 90 శాతం పనులు కెటీఆరే చూస్తున్నారని సంచలన ప్రకటన చేశారు. బుధవారం నాడు కూడా కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కెటీఆర్ ను సీఎం చేయాలంటూ..అప్పుడే మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రకటించారు. ఈ తరుణంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటీఆర్ ను సీఎం చేయాలని ప్రగతి భవన్ లో టీవీలు పగులుతున్నాయని వ్యాఖ్యానించారు. టీవీలు పగులుతున్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారన్నారన్నారు. ఆయన సీఎం అయితే తమకు వచ్చే లాభమేమీలేదన్నారు. కెటీఆర్ సీఎం కావటం ఉద్యమకారులు ఎవరికీ ఇష్టం లేదన్నారు.

కెసీఆర్ పదవి నుంచి తప్పుకుంటే ఇప్పడైనా ఓ దళితుడిని సీఎం చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు. బండి సంజయ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారన్నారు. పూజా సామాగ్రిని త్రివేణి సంగంమంలో కలపటానికే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్ళారన్నారు. కాళేశ్వరంలో సీఎం దంపతులు ఏం కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజక్టుపై ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడ్తున్నారని, మూడో టీఎంసీతో సాధించిందేంటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. రానున్న మూడేళ్ళల్లో లక్షల కోట్లు వెనుకేసుకోవటానికి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు.

ఉద్యమ ద్రోహులు‌‌ మాత్రమే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారని, టీఆర్ఎస్‌లో ఉన్న నిజమైన ఉద్యమకారులకు కేటీఆర్ సీఎం కావటం ఇష్టం లేదన్నారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కష్టమొచ్చిన ప్రతీసారీ ఈటలను ముందుపెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని విమర్శించారు. తమకు ప్రజల మద్దతుందన్నారు. 125అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఎంత వరకు వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ చేసే పూజలు ఆయన కుటుంబ బాగు కోసమేనని, తాము చేసే పూజలు సమాజహితం‌ కోసం అన్నారు.

Tags:    

Similar News