అలా చేస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు అడ్డుకుంటాం

Update: 2020-11-09 14:12 GMT

పాతబస్తీని భాగ్యనగరం తాము చూస్తుంటే, టీఆర్ఎస్ భాగ్యనగరాన్ని పాతబస్తీ చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ తో కలిసి అక్రమాలకు పాల్పడుతూ ఓట్లను తారుమారు చేశారని విమర్శించారు. హిందువుల ఓట్ల తగ్గించి ముస్లిం ల ఓట్లను పెంచారన్నారు. బీజేపీ ఇచ్చే అభ్యంతరాలను పరిశీలన చేయకుండా షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికలను అడ్డుకుంటామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కలిసి సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీలో సర్వే చేశారు- ఫలితాల్లో బీజేపీ స్టాంగ్ అని తేలింది. ఎల్లుండి నుంచి డివిజన్ల వారిగా బీజేపీ ఆందోళనకు పిలుపునిస్తోందని తెలిపారు.

త్వరలో వార్డులు- డివిజన్ల వారిగా జీహెచ్ఎంసీలో బీజేపీ పాదయాత్ర చేయనుందని తెలిపారు. వరదల్లో నష్టపోయిన వారికి 10వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్నారు. లేదంటే శాంతి భద్రతలకు ప్రభుత్వమే విఘాతం కలిగించినట్లు అవుతుందని పేర్కొన్నారు. మియాపూర్ నుంచి నాంపల్లి వరకు బండి సంజయ్ మెట్రో రైల్లో తొలిసారి ప్రయాణించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి అవకాశమిస్తే పాతబస్తీని హైటెక్‌సిటీగా మారుస్తామని వెల్లడించారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికుందా? అని సంజయ్‌ ప్రశ్నించారు.

Tags:    

Similar News