నువ్వు సంబ‌ర‌ప‌డు...అయినా నేను బాధ‌ప‌డ‌ను

Update: 2022-01-05 16:25 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. హైకోర్టు ఆదేశాల‌తో ఆయ‌న బుధ‌వారం రాత్రి జైలు నుంచి విడుద‌ల అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. 317 జీవోను స‌వ‌రించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. కొంత మంది ఉద్యోగ‌ సంఘ నేత‌ల‌ను సంక‌లో పెట్టుకుని డ్రామాలు చేస్తున్నార‌ని..ఆ నాయ‌కుల‌ను కూడా వ‌దిలిపెట్టే ప్ర‌సక్తేలేద‌న్నారు. బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే' రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను జైలుకు పంపినని సంకలు గుద్దుకుండు.. ఆ సీఎంకు తెల్వదేమో... బీజేపీ కార్యకర్తలకు, నాకు జైలు కొత్త కాదు. నేను జైలుకు పోవడం ఇది 9వ సారి. నేను నీలాగా చీటర్ ను కాదు... దొంగతనం చేసో.. లంగతనం చేసో జైలుకు పోలేదు. నేను జైలుకు పోయింది ఉఫాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం... నువ్వు సంబరపడు... నేనేమీ బాధపడను. ఉద్యోగ, ఉపాధ్యాయులు బాధపడుతున్నరు. కానీ 317 జీవోను మాత్రం సవరించాలని డిమాండ్ చేస్తున్న. లేనిపక్షంలో నీ సంగతి చూస్తాం. సీనియర్లకు, జూనియర్లకు కొట్లాట పెట్టకు. ఆ జీవోను సవరించు. విడో, దివ్యాంగులకు, స్పౌజ్ లకు అవకాశం కల్పించు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపి న్యాయం చెయ్.

కొందరు తూట్ పాలీష్ సంఘాల నేతలను పక్కన పెట్టాలి. లేకపోతే వాళ్లంతా నీవీపు సాఫ్ చేయడానికి సిద్ధం. 317 జీవో సవరించేదాకా కొట్లాడతాం. ఇప్పుడు స్పందించకపోతే మీ జీవితాలు నాశనమైతయ్. మీకు అండగా మేముంటం. మీ ఉద్యోగాలు పోతే మేం అధికారంలోకి వచ్చాక మేమిస్తాం. మీ గురించి మాట్లాడని సంఘాల వీపంతా సాఫ్ చేయండి. ఇక యుద్దం స్టార్ట్ అయ్యింది. కొందరు ఉద్యోగ సంఘ నాయకులను సంకనేసుకున్నడు. నిన్ను, నీకు కొమ్ముకాసే ఉద్యోగ సంఘాల నాయకులను మాత్రం వదిలిపెట్టను. జైలుకు పంపినని అనుకుంటున్నవేమో...నేను జైలుకు పోతే... తెలంగాణ సమాజం బాధపడింది. బయటకు రావాలని కోరింది. నేను ధర్మం కోసం, న్యాయం, నిరుద్యోగుల కోసం మళ్లీ జైలుకు పోవడానికి నాతోసహా ప్రతి పార్టీ కార్యకర్త పోవడానికి సిద్ధం. నువ్వు జైలుకు పోతే ఈ మూర్ఖుడు జైలుకు పోయిండు... ఇక బయటకు రానివ్వొద్దని తెలంగాణ సమాజం అంతా కోరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

నన్ను నా ఆపీసును బద్దలు కొడతావ్. అందుకే హైకోర్టు మొట్టికాయలు వేసింది. థూ.. నీ బతుకు చెడ‌...ఇందుకోసమా నీకు అధికారం ఇచ్చింది? మేం నీలెక్క చీటర్లమా? అవినీతిపరులమా? దుండగులమా? ప్ర‌జ‌ల కోసం కొట్లాడేటోళ్లం. నేను ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, మాది ప్ర‌పంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ. నీ తాటాకు చప్పళ్లకు భయపడతమా? కార్యకర్తలపై లాఠీఛార్జ్ 9 సార్లు చేస్తవా? గ్యాస్ కట్టర్ పెట్టి ఆఫీస్ గేట్లను ధ్వంసం చేస్తవా? ధ‌ళిత మహిళ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘటనా స్థలం లేకున్న ముందస్తు అరెస్టు చేస్తవా? ఆమె అక్కడికి రానేలేదు. అయినా ఆమె ఏం తప్పు చేసిందని మళ్లీ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తవ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తవా? లోపల జైలు ఎట్లుందో చూసి వచ్చిన... నువ్వు కూడా ఈ జైలుకు పోయే రోజులు దగ్గర్లో ఉన్నయ్. నిన్ను గుంజుకుపోయి జైల్లో వేసే రోజు దగ్గర్లోనే ఉన్నయ్. వేల కోట్లు దోచుకుంటున్నవ్. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పే మాకు ఆధారం. ఈ కేసు తప్పని, మెట్టికాయలు వేసింది.

నీ వ్యవహార శైలిని తప్పు పట్టింది. అయినా బయటకు రాకుండా గంటన్నర రెండుగంటలు నుండి నన్ను బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నవ్. నాకు నష్టమేమీ లేదు. నాకు నీ లెక్క తాగుడు అలవాటు లేదు. నీలాగా దురలవాట్లు లేవు. ఇంకా వారం రోజులైనా జనం కోసం జైల్లో ఉండేందుకు సిద్దం. నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉన్నవ్.... మేం కేంద్రంలో అధికారంలో ఉన్నామనే సంగతి గుర్తుంచుకో. నన్ను జైలుకు పంపినవ్ కదా....నన్ను జైలుకు పంపడం ద్వారా నీవెంత మూర్ఖుడివో, రాక్షసుడివో, నీచుడివో జనానికి అర్ధమైంది. హ్యాట్సాఫ్ సీఎం. జనం నిన్ను థూ.. అంటున్నరు. నువ్వు సెక్యురిటీ లేకుండా బయట తిరుగు... నిన్ను టీచర్లు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు రాళ్లతో కొడతరు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను అణగదొక్కినట్లు అనుకుంటున్నవమో.. నీ ఆటలిక సాగవు.. ఎవరైతే కుటుంబ పాలన చేసిన నీలాంటి వాళ్లంతా మట్టి కరిచిపోయిండ్రు. నీ నీచపు పాలనకు చరమ గీతం పాడతారు.' అంటూ మండిప‌డ్డారు.

Tags:    

Similar News