మేం పాద‌ర‌క్షలు అందిస్తాం..మీరు కాళ్లులాగే ర‌కం

Update: 2022-08-22 13:35 GMT

తెలంగాణ‌లో దుమారం రేపిన చెప్పుల అంశంపై తెలంగాణ బిజెపి ప్రెసిడెండ్ బండి సంజ‌య్ స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయ‌న చెప్పులు అందించిన వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా మంత్రి కెటీఆర్ తోపాటు కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ త‌దిత‌రులు ఇది తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టే పెట్టే చ‌ర్య అంటూ మండిప‌డ్డారు. దీంతో బండి సంజ‌య్ త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్ధించుకుంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గానే స‌మాధానం ఇచ్చారు. 'మేం పాద రక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం..!. మీలా అవసరం తీరాక పాదాలుపట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం " గులామ్ "లం కాదు - మీలా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు. రామ - భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం... తండ్రిని బంధించి,అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు,మా సంస్కృతి ఏం అర్థమవుతుంది ?.!అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబసభ్యులకు,పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థం అవుతది?.

ప్రణబ్‌, నరసింహన్‌కు కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. కోవింద్‌కు ఎందుకు మొక్కలేదు.' అంటూ ప్ర‌శ్నించారు. తాము గౌరవంతో పాద‌ర‌క్షలు అందిస్తామ‌ని..కెసీఆర్, ఆయన ఫ్యామిలీదీ అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత కాళ్లుప‌ట్టుకుని లాగిప‌డేసే ర‌కం అంటూ మండిప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారిన లిక్క‌ర్ స్కామ్ అంశంపైనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబసభ్యుల రహస్యాలు బయట పడకుండా తంటాలు పడుతూ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటూ బండి సంజ‌య్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీపై ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రామచంద్రపిళ్లై, అభిషేక్‌తో సంబంధాలు ఉన్నాయా? లేదా?. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే కేటీఆర్‌ ఎందుకు ట్వీట్‌ చేయడం లేదు. ప్రతీ స్కాంలో కేసీఆర్‌ ఫ్యామిలీ ఉందంటూ బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News