బిజెపి నాయకుడు తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. తమ నేత కే టీ ఆర్ కుమారుడిపై వాడిన జుగుప్సాకరమైన భాష ను ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం బీజేపీ కి కొట్టిన పిండి అని విమర్శించారు. ఇప్పటికే ఎవరో చెంప దెబ్బ కొట్టినట్లు వీడియో చూశామన్నారు...ఇలా చేస్తే చెంప దెబ్బలే కాదు..చెప్పు దెబ్బలు పడతాయని హెచ్చరించారు. బాల్క సుమన్ శనివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చింతపండు నవీన్ చర్యలు బీజేపీ ఆటలో భాగం అని, బండి సంజయ్ చెబితే నవీన్ చేస్తాడని ఆరోపించారు. మహిళలను, కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోందని, ఈ ధోరణి బీజేపీ కి మంచిది కాదన్నారు. తన ఆస్తుల పై కూడా బీజేపీ సోషల్ మీడియా లో విష ప్రచారం నడుస్తోందని, ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిస్తానని సవాల్ విసిరారు.
ఇలాంటి విష ప్రచారం చేస్తుంటే పోలీసు విభాగం ఏం చేస్తోందని, తాము చాలా సందర్భాల్లో డిజీపీ కి ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశామని తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే తమ పార్టీ కార్యకర్తలు స్పందిస్తారన్నారు. పోలీసులు సుమోటో గా కేసులు ఎందుకు నమోదు చేయరు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రులపై అసభ్య ప్రచారం జరుగుతుంటే పోలీసులు కచితంగా స్పందించాలన్నారు. నిరుద్యోగం పై బండి సంజయ్ దీక్ష చేస్తా అని ప్రకటించడం హాస్యాస్పదం అని, దేశం లో నిరుద్యోగం పెరుగుతుంటే మోడీ ఎం చేస్తున్నారు.. గడ్డి పీకుతున్నారు? అని ఎద్దేవా చేశారు. టీ ఆర్ ఎస్ కార్యకర్తలు బీజేపీ విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.