తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అరెస్ట్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ అని విమర్శించారు. టీడీపీ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడటం సరికాదన్నారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయి.
ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలి. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.