'వరి సోమరిపోతు వ్యవసాయం' అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు రైతులకు క్షమాపణ చెప్పారు. ఉండిలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా రైతులు ఇబ్బంది పడితే క్షమించాలన్నారు. మంత్రి ఆదివారం నాడు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఉండిలోని కృషి విజ్ణాన కేంద్రం రజతోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడిన మంత్రి వరి సాగుకు కష్టపడనక్కర్లేదు..వరి సోమరిపోతు వ్యవసాయం అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై పెద్ద రాజకీయ దుమారం రేగింది.
ఏపీలోని పలు పార్టీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..మంత్రిని పదవి నుంచి తప్పించాలి డిమాండ్ చేశాయి. దీంతో మంత్రి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను భూ యాజమానులే అనుభవిస్తున్నారని..అవి కౌలు రైతులకు అందటం లేదన్నారు. ఆ ఆవేదనతోనే మాట్లాడానని..రైతులను కించపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు.