నేతలు అంతే..తిట్టుకుంటారు..నవ్వుకుంటారు!
Full Viewరాజకీయ నేతలు అంతే. తిట్టుకుంటారు.. ఆ తర్వాత కలసి హాయిగా నవ్వుకుంటారు. ఈ ఫోటో చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగక మానదు. దావోస్ లో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ లు కలసుకున్నారు. ఇలా కలుసుకోవటంపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అదేమీ తప్పు కూడా కాదు. కానీ దీనికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే తాజాగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ ఏపీలోని రహదారులు, విద్యుత్ సమస్య, తాగునీటి సమస్యపై క్రెడాయ్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికి వెళ్ళి చూసి వస్తే తెలుస్తుంది తెలంగాణ గొప్పదనం అంటూ పేర్కొన్నారు. అంతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెడితే సీనియర్, జూనియర్ మంత్రులు తర్వాత మంత్రి కెటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేశారు. అయితే ఆ తర్వాత మంత్రి కెటీఆర్ అన్యాపదేశంగానే తాను ఆ మాటలు అన్నాను తప్ప..ఏపీలోని నాయకులను ఇబ్బంది పెట్టడానికి కాదని వివరణ ఇచ్చారు.
అయితే తాజాగా జగన్, కెటీఆర్ భేటీ ఫోటోను తెలంగాణ మంత్రి కెటీఆర్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నా సోదరుడు జగన్ తో మంచి సమావేశం జరిగింది అంటూ పేర్కొన్నారు. అంతే ఇది వైరల్ గా మారింది. అంతే కాదు..అదే ట్విట్టర్ లో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలంగాణకు అంత భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే మీరు ఆయనకు (సీఎం జగన్ కు ) రుణపడి ఉండాలి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఏంటి మొన్న చెప్పిన రోడ్లు. విద్యుత్ సంగతే అక్కడ కూడా చెబుతున్నారా అంటూ మరో ట్విట్టర్ యూజర్ ప్రశ్నించాడు. మరోక వ్యక్తి రెండు రాష్ట్రాలు ఇలా ఫ్రెండ్లీగా ఉండాలని సూచించాడు. ఒకే ఫ్రేమ్ లో తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ను చూస్తున్నామని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫోటోపై నెటిజన్ల స్పందన ఓ రేంజ్ లో ఉంది. ఓ నెటిజన్ అయితే తెలంగాణ ఐటి మంత్రి..ఏపీ సీఎంతో సమానం అన్నట్లు ఉంది అంటూ కామెంట్ చేశారు.