ఇదే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటికి టీడీపీ ప్రభుత్వంలో పలు పథకాలకు చంద్రబాబు తన పేరుపెట్టుకోవటంపై మండిపడింది. ప్రతిదానికి చంద్రన్న పేరు ఏంటి ...ఈ పథకాల అమలుకు చంద్రబాబు ఏమైనా తన తండ్రి ఖర్జుర నాయుడు సంపాదించిన డబ్బులు ఖర్చుపెడుతున్నారా అంటూ ఇప్పటి మంత్రి రోజా అప్పటిలో వైసీపీ పార్టీ ఆఫీస్ వేదికగా చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వైసీపీ పార్టీ ఆఫీస్ వేదికగా మాటలు అంటే అవి జగన్ ఆమోదం లేకుండా వచ్చినవి కావు అనే భావించాలి. మరి ఇప్పుడు మంత్రి రోజా...గతంలో చంద్రబాబు పేరు పెట్టుకున్నప్పుడు తప్పు పట్టాం అనే విషయం సీఎం జగన్ కు చెప్పరా?. చెప్పినా కూడా మన స్టాండ్ ప్రతిపక్షంలో ఉంటే ఒకటి...అధికారంలో ఉంటే ఒకటి అని జగన్ లైట్ తీసుకుంటారా అంటే ఇదే నిజం అని నమ్మే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. అమలు అవుతున్న పథకాల వాయిదాల విడుదలకు కూడా ఒక స్కీం ప్రకారం పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తూ వైసీపీ సర్కారు కొత్త సంప్రదానికి శ్రీకారం చుట్టింది అనే చెప్పాలి. వైసీపీ సర్కారు తీరు చూసిన అధికారులు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకోవటంలో జగన్ గత ముఖ్యమంత్రులు అందరిని అధిగమించారు అని చెపుతున్నారు. ఇంత భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూ కూడా ప్రచారంలో తాము వీక్ అని చెప్పుకోవటం కూడా వైసీపీ కే చెల్లింది.