జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం, ఇసుక, సిమెంట్ వ్యాపారాలకే పరిమితం అయ్యారని ఆరోపించారు. సీఎం తోపాటు ఆయన అనుచరులు కూడా ఇదే పనిలో ఉన్నారని ఆరోపించారు. రోజుకు 500 కోట్ల రూపాయల అప్పు చేసేది ఇదేమి ప్రభుత్వం..ఇదేం పాలన అని ప్రశ్నించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక వ్యవహారంలో బిజెపి, జనసేనల మధ్య సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ ఆదివారం నాడు తిరుపతి చేరుకున్నారు. ఆయన తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. "వైసీపీ ప్రభుత్వం రోజుకు రూ.500 కోట్లు అప్పు చేసి ప్రజల్ని మభ్యపెడుతుంది. సామాన్యునికి దూరంగా ఈ పాలన సాగుతోంది. సంక్షేమ కార్యక్రమాలు పేరుతో ప్రజలను మబ్బులో ఉంచాలనే ప్రయత్నం సాగుతోంది. ఎన్నికలప్పుడు దౌర్జన్యాలు, ఎన్నడూ లేని విధంగా అధికార యంత్రాంగాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేయడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఈ పోకడలను జనసేన పార్టీ దీటుగా ఎదుర్కొంటుంది.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరినట్లుగా బీజేపీ అగ్రనాయకత్వం ఒక మంచి అభ్యర్థిని బరిలో నిలిపారు. ఐ.ఏ.ఎస్. అధికారిణిగా ఎంతో అనుభవం ఉన్న రత్నప్రభ ఎన్నికైతే ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేడతారన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ మమ్మల్నందరినీ ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఆమె విజయానికి విశేష కృషి చేయాలని ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తారు. ఆయన ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలి. పార్టీ శ్రేణులు అధ్యక్షుల వారి ఆకాంక్షను ప్రతి పల్లెకు, పట్టణానికి చేరవేయాలి" అన్నారు.