ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీ మంత్రివర్గంలో వంద శాతం కొత్త వారిని తీసుకుంటానని సీఎం జగన్ చెప్పారన్నారు. సీఎం జగన్ తీసుకునే విధాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. మంత్రి పదవి పోయినా తాను భయపడను. తనకు పార్టీ ముఖ్యం. పదవులు కాదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే రెండున్నర సంవత్సరాలు కొంత మంది, మిగిలిన రెండుడున్నర సంవత్సరాలు మరికొంత మందికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు. తొలి విడత రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా మంత్రి పదవులు పోవటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ఎవరికైనా మినహాయింపులు ఉంటాయా? లేక బాలినేని చెప్పినట్లు సీఎం జగన్ తప్ప ప్రస్తుత కేబినెట్ లో అందరి పదవులు పోతాయా అన్నది అత్యంత కీలకంగా మారింది. మొత్తం మీద చూస్తే కేబినెట్ మంత్రులందరూ ఇంటిదారి పట్టడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరికి పదవులు వస్తాయా అన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది.