సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి

Update: 2021-11-12 11:22 GMT

గ‌ల్లీల్లో కాల‌రెగ‌రేసి..లోప‌ల కాళ్లు ప‌ట్టుకునే అల‌వాటు జ‌గ‌న్ కు లేదు. పేర్ని నాని

అనూహ్యం. అనుకోకుండా వేడి ర‌గిలింది. ఒక‌రు ఏపీ సీఎం జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తే..మ‌రొక‌రు తెలంగాణ సీఎం కెసీఆర్ ను ఎటాక్ చేశారు. తెలంగాణ మంత్రి మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి శుక్ర‌వారం నాడు జ‌గ‌న్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తే..వీటికి కౌంట‌ర్ గా ఏపీ మంత్రి పేర్ని నాని కూడా అంతే ఘాటుగా స్పందించారు. అయితే అక‌స్మాత్తుగా తెలంగాణ మంత్రి ఈ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం వెన‌క కార‌ణం ఏమి అయి ఉంటుందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తెలంగాణ వ‌స్తే అడుక్కుతింటార‌ని గ‌తంలో త‌మ‌ను ఎద్దేవా చేశార‌ని ..ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ బిచ్చ‌మెత్తుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం సాయం లేకుండా అక్క‌డ రాష్ట్రం పూట గ‌డిచే ప‌రిస్థితి లేదన్నారు. అందుకే కేంద్రం చెప్పిన‌ట్లు అక్క‌డ రైతుల పొలాల‌కు మోటార్లు పెడుతున్నార‌ని అన్నారు. ఒక‌ప్పుడు ఇక్క‌డ ఆదాయం దోచుకెళ్ళి ఆంధ్రా వాళ్ళు వాడుకునేవార‌ని..ఇప్పుడు కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే తింటున్నామ‌న్నారు. ఇప్పుడు మన పైసలు ఏపీకి పోవట్లేదన్నారు. ఏపీ వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. రోజు ఖర్చులకు కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారన్నారు. ఇప్పుడు అప్పులు చేయకుంటే ఏపీలో పాలన నడవదని ఎద్దేవా చేశారు. మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ఘాటుగానే స్పందించారు. సీఎం కెసీఆర్ మాట్లాడితే ఢిల్లీ ఎందుకు వెళుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

రోడ్ల మీద కాల‌ర్ ఎగ‌రేసి..లోప‌లికి కాళ్ళు ప‌ట్టుకుంటున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మా తలుపులు తెరిచే ఉన్నాయి..కేంద్ర మంత్రివ‌ర్గం లో చేర‌తాం..కేంద్ర‌మంత్రివ‌ర్గంలో చేర‌తామ‌ని చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల విభ‌జ‌న స‌మ‌యంలో అంద‌రూ క‌ల‌సి డెవ‌ల‌ప్ చేసిన హైద‌రాబాద్ న‌గ‌రం తెలంగాణ‌క‌కు అయిపోయింద‌ని..అంత పాడి ఆవు ఉన్నా కూడా ఇంకా అప్పులు ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కాంట్రాక్ట‌ర్ల‌ను అడిగితే అక్క‌డ ప‌రిస్థితి ఏంటో చెబుతార‌న్నారు. తెలంగాణ‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా డ‌బ్బులు ఉన్నాయ‌ని..వాటిని అప్పుగా అయినా ఇస్తార‌ని గ‌ల్ఫ్ దేశాల వారితో పాటు ఆప్ఘ‌నిస్తాన్ వారు కూడా వ‌చ్చార‌ని ఎద్దేవా చేశారు. అస‌లు ఏపీ గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని..ఏపీ ఏమి చేసింద‌ని పేర్ని నాని ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్ కు లోప‌ల ఒక‌టి..బ‌య‌ట ఒక‌టి మాట్లాడ‌టం రాద‌ని..దోస్తీ అంటే దోస్తీ..సై అంటే సై అని వ్యాఖ్యానించారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన‌ట్లు ఉంది తెలంగాణ మంత్రుల వ్య‌వ‌హారం అన్నారు. ఎవ‌రినో తిట్టలేక త‌మ‌పై మాట్లాడ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

Tags:    

Similar News