అమరావతి తీర్పుపై చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు వెలువరించిన తీర్పుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ సేవ్ అమరావతి అంటూ ఉద్యమించిన తాము ఇక నుంచి బిల్డ్ అమరావతి అంటూ ఉద్యమిస్తామని తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని హైకోర్టు తీర్పును అమలు చేయాలని అన్నారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుడూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడని, రాజధాని ఇక్కడే అన్నారని, తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కల ఆట మొదలు పెట్టాడని చంద్రబాబు మండిపడ్డారు రాజధానిలో ఒకే వర్గం అని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ముంపు లేని చోట ముంపు అని ప్రచారం చేశారని, కృష్ణానది పక్కన ఉండే భూమిని శ్మశానం అన్నారని తప్పుపట్టారు.
ఇలాంటి దుర్మార్గులు ఉంటారని పక్కాగా సీఆర్డీఏ చట్టం చేశామని చెప్పారు. 807 రోజులు రైతులు ఆందోళన చేస్తే అవమానించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మహిళా రైతులు వీరోచితంగా పోరాడారు. పాదయాత్రకు వెళ్ళిన రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అంతా చూశాం. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అమరావతి పోరాటం చాటింది. తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనునుడిగా మిగిలిపోతారు. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన విజయం ఐదు కోట్ల తెలుగు ప్రజలది. రాజధాని ఉద్యమ రైతులకు, ప్రజలకు అభినందనలు. సిగ్గు లేకుండా నాకు కులం అంట గడుతున్నారు. నాకు ఏ కులం లేదు...పేదలే నా కులం.'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో అతి పెద్ద వెంకటేశ్వరిస్వామి ఆలయం నిర్మించాలని ప్రతిపాదిస్తే దాన్ని కూడా ఆపేశారన్నారు. రాజధాని భూములు తాకట్టుపెట్టి జగన్ డబ్బులు తెచ్చుకోవాలని ప్రయత్నించారన్నారు.