కాంగ్రెస్ పార్టీకి షాక్..టీఎంసీలోకి ప్ర‌ణ‌బ్ త‌న‌యుడు

Update: 2021-07-05 12:21 GMT

సీనియ‌ర్ నేత‌లు ఎంత మంది పార్టీలో వేగం పెంచాల‌ని..పూర్తిగా మార్పులు తెస్తే త‌ప్ప కేంద్రంలోని బిజెపిని, మోడీని ఢీకొట్ట‌డం సాధ్యంకాద‌ని చెబుతున్నారు. చాలా మంది సీనియర్లు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయినా కూడా కాంగ్రెస్ లో రాజ‌కీయ వేడి పెర‌గ‌టం లేదు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించే ప‌లు రాష్ట్రాల్లో కీల‌క నేత‌లు పార్టీలు మారుతున్నారు. ప‌శ్చిమ బెంగాల్ లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. దీంతో ఇక పార్టీలో కొన‌సాగితే భ‌విష్య‌త్ ఉండ‌ద‌నుకున్నారో ఏమో కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న పార్టీ మార్పుపై ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది సోమ‌వారం నాడు కార్య‌రూపం దాల్చింది. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన అభిజిత్ టీఎంసీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. కాంగ్రెస్‌లో తనకు ఎలాంటి హోదా ఇవ్వనందున టీఎంసీలో చేరానని, తనకు టీఎంసీ ఏ పదవి ఇచ్చినా ఒక సైనికుడిలా బాధ్యతతో పనిచేస్తానని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకున్న వారి నాయకత్వంలో పనిచేయడం ఒక విశేషాధికారంగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో యావద్దేశంలోనూ మతతత్వ వేవ్‌ను మ‌మ‌తా బెన‌ర్జీ నియంత్రించగలరని నేను నమ్ముతున్నాన‌ని అభిజిత్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News