కరోనా కారణంగా ఓ ఎమ్మెల్యే మరణించారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఈ వైరస్ బారినపడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) బుధవారం నాడు మృతి చెందారు. కరోనా సోకడంతో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం తీవ్ర విషాదకరంగా మారింది. చెన్నయ్ చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన చెన్నయ్ లోని క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందారు. ఎమ్మెల్యేకు బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అన్బళగన్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కారణంగా ఓ ఎమ్మెల్యే మృతి చెందడం ఇదే తొలిసారి. అన్బళగన్ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.