కరోనాపై కెసీఆర్..కెటీఆర్ చెరో మాట..ఏది నిజం?

Update: 2020-05-03 14:57 GMT

త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం అవుతుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పటికే ఈ మాట చాలా సార్లు చెప్పారు. తొలుత ఏప్రిల్ 7 నాటికే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం అవుతుందని ప్రకటించారు. తర్వాత మరో తేదీ వచ్చింది. ఢిల్లీలో జరిగిన మర్కజ్ వల్లే సమస్య వచ్చిందని..లేకపోతే ఇఫ్పటికే సమస్య పోయేదన్నారు. ఏప్రిల్ 7 పోయింది..మే 7 వస్తోంది. కానీ ఇంకా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికీ ఆగుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. సీఎం కెసీఆర్ ఎప్పటికప్పుడు తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ గురించి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇదే మాటను ప్రస్తావిస్తున్నారు. కెసీఆర్ వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ మాత్రం అందుకు భిన్నమైన వాదన విన్పిస్తున్నారు. తాజాగా మంత్రి కెటీఆర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనాతో కలసి ముందుకు సాగటం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మరి ఎవరి మాటను నమ్మాలి?. సీఎం కెసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణ త్వరలోనే కరోనా ఫ్రీ స్టేట్ అవుతుందా? లేక కెటీఆర్ చెబుతున్నట్లు కరోనాతో కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందా?. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) ఎప్పటినుంచో చెబుతోంది.

కరోనా వైరస్ అంతం కావటానికి చాలా సమయం పడుతుందని..కేసులు తగ్గిన చోట కూడా మళ్ళీ వస్తున్నాయని స్పష్టం చేసింది. నిపుణులదీ ఇదే మాట. ప్రస్తుతం చైనాలో కూడా ఇంకా కొత్త కేసులు వస్తునే ఉన్నాయి. కెసీఆర్, కెటీఆర్ మాటలను పరిగణనలోకి తీసుకుంటే మంత్రి కెటీఆర్ వాదనే సరైనది అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందునా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అయిన సీఎం, ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ లు భిన్నవాదనలు విన్పించటం ఏ మాత్రం సరికాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో కరోనా పరీక్షల విషయంలో విపక్షాలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సరైన రీతిలో పరీక్షలు చేయకపోవటం వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయని కాంగ్రెస్, బిజెపిలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సర్కారు మాత్రం జాతీయ సగటు కంటే పరీక్షల్లో తెలంగాణ చాలా ముందు ఉందని ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. కరోనాకు మందు కనిపెట్టడం లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప ఈ వైరస్ అంతం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ..రాబోయే రోజుల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని చెబుతున్నారు.

 

 

Similar News