ట్రంపే ‘అంతా చేశారు’..అమెరికాను కరోనాతో ముంచారు

Update: 2020-04-13 05:48 GMT

అందరూ హెచ్చరించినా పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు

ప్రధాన వాణిజ్య సలహాదారు సూచనలు బేఖాతర్

న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనం

ఒకటి కాదు..రెండు కాదు. అమెరికాలోని కీలక విభాగాలు అన్నీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కరోనా వైరస్ విషయంలో చాలా ముందే హెచ్చరించాయి. కానీ ట్రంప్ మాత్రం ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. తనకు తోచినట్లే ముందుకెళ్లారు. ఇప్పుడు అమెరికాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. అమెరికాలోని ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు జాతీయ భద్రతా విభాగాలు, ప్రభుత్వ ఆరోగ్య అధికారులందరూ కరోనా వైరస్ పై చాలా ముందస్తు హెచ్చరికలు చేసినా వాటిని అమెరికా అధ్యక్షడు ఏ మాత్రం పట్టించుకోలేదని ‘న్యూయార్క్ టైమ్స్ ’ సంచలన కథనం ప్రచురించింది. ట్రంప్ కు చెందిన కీలకమైన వాణిజ్య సలహాదారు అయిన పీటర్ నవారో జనవరి నెలాఖరులోనే వైట్ హౌస్ కు తీవ్రమైన హెచ్చరికలతో ఓ మెమో పంపారు. కరోనా మహమ్మారి కారణంగా అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అందులో హెచ్చరించారు. ఈ కారణంతో అమెరికాలో ఏకంగా ఐదు లక్షల మరణాలు సంభవించటంతోపాటు భారీ ఎత్తున ఆర్ధిక నష్టం వాటిల్లనుందని స్పష్టం చేశారు. ఆ మెమోలోనే చైనా నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించాలని కోరారు.

అమెరికాలోని 30 శాతం ప్రజలు ఈ వైరస్ బారిన పడతారని, ఇందులో ఐదు లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఈ మెమోను తాను చూడలేదని ఖండించారు. కానీ పీటర్ నవారో తన అభిప్రాయాలను ఇలా లిఖితపూర్వకంగా చెప్పటంపై ట్రంప్ అసహనంతో ఉన్నట్లు టైమ్స్ కథనం పేర్కొంది. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు చాలా దూకుడుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని..అదే సమయంలో పడక్భందీ వ్కూహం అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ సూచనలు అన్నింటిని ట్రంప్ పెడచెవిన పెట్టారు. వైట్ హౌస్ లోని పరిపాలనా సిబ్బంది కూడా రెండు గ్రూపులుగా విడిపోయి వ్యవహరించటంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. జనవరి ప్రారంభంలోనే జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్ సి) అధికారులు చైనాలోని వుహాన్ లో పుట్టిన వైరస్ పై హెచ్చరికలు చేశారు. ఈ వైరస్ కు సంబంధించి చైనానే కారణమని జాతీయ భద్రతా విభాగం అధికారులు వెల్లడించేందుకు సిద్ధం కాగా..అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్ధిక సలహాదారులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

దీనికి కారణం ఏమిటంటే చైనాతో అప్పుడు ట్రంప్ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నందున వీటికి విఘాతం కలుగుతుందనే ఉధ్దేశంతోనే వీటిని తొక్కి పెట్టారని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. ఫిబ్రవరి మూడవ వారంలో ప్రజారోగ్య విభాగంలోని ఉన్నతాధికారులు అందరూ దూకుడుగా వైరస్ ను నిరోధించేందుకు వ్యూహం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అందులో భాగంగానే భౌతికదూరం పాటించటంతోపాటు వర్క ఫ్రమ్ హోమ్, పాఠశాలలు మూసివేతలు వంటి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.అయితే వీరికి ఎప్పుడూ కూడా తమ ప్రణాళికలను ట్రంప్ కు వివరించే అవకాశం కూడా దక్కలేదని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలలు మొత్తం విద్యావేత్తల గ్రూప్, ప్రభుత్వ ఫిజీషియన్లు, వైరస్ ల ను నియంత్రించే డాక్టర్లు, ట్రంప్ పరిపాలనా అధికారులతో సహా అందరూ కలసి కరోనా వైరస్ ప్రమాదంతో ఓ సుదీర్ఘ మెయిల్ పంపారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ వైరస్ విజృంభిస్తుందని పేర్కొన్నారు. ఇలా ఎన్నో విభాగాలు ముందస్తు హెచ్చరికలు చేసినా ట్రంప్ మాత్రం పట్టించుకోలేదు. ఆ పలితమే ఇప్పుడు అమెరికా కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 13 1.30 గంటలకు ఆ దేశంలో మొత్తం కరోనా కేసులు 5,57,571 ఉండగా, మరణాలు 22,108కి చేరాయి. న్యూయార్క్ లో కేసులు 1,90,288కి పెరిగాయి.

 

 

 

 

 

Similar News