ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితం గతంలో లాగా ఉండకపోవచ్చని అన్నారు. లాక్ డౌన్ అంశంపై అన్ని పార్టీల నేతలతో మాట్లాడిన సమయంలో ఆయన ఈ మాటలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయటం సాధ్యం కాకపోవచ్చని ప్రధాని మోడీ అఖిలపక్ష నేతలకు స్పష్టం చేశారు. అయితే ఈ నెల 11న మళ్ళీ దేశంలోని ముఖ్యమంత్రులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు దేశంలో పరిస్థితి కరోనాకు ముందు..కరోనాకు తర్వాత అన్నట్లుగా మారతాయన్నారు.
వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో దేశంలో కరోనా నివారణకు చేపట్టిన చర్యలను కూడా అఖిలపక్ష నేతలకు మోడీ వివరించారు. అయితే పలు పార్టీల నేతలు వైద్య సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు, పీపీఈ కిట్ల కొరత తదితర అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్ళారు.