కర్నూలు లో కరోనా ఆందోళనకరం

Update: 2020-04-27 14:32 GMT

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాతోపాటు నగరంలోనూ కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరగటం బాధాకరమన్నారు. పవన్ కళ్యాణ్ సోమవారం కర్నూలు జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల, లాక్ డౌన్ పరిణామాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ‘కరోనా వ్యాప్తి విషయాన్ని మతం కోణంలో చూడటం తగదు. ఇది మానవాళికి వచ్చిన విపత్తు. దీన్ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో రైతాంగం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటోంది. తమ పంటను అమ్ముకోలేకపోతున్నారు. పేద వర్గాలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాల కంటే ప్రజల కష్టాలు తీర్చేలా పని చేయడం ముఖ్యం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యే విధంగా స్పందించడమే మన విధానం.

కర్నూలు జిల్లా నుంచి వలస వెళ్ళిన కార్మికులు ఇబ్బందులుపడుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో కరోనా విస్తృతి ప్రమాదకరంగా ఉంది. కర్నూలులో అత్యధిక కేసులు వస్తున్నాయి. కర్నూలు ఎంపీ చేసిన వ్యాఖ్యలు చూస్తే పరిస్థితి చేయి దాటిపోతోంది అనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, పౌరులను ఆదుకోలేకపోతున్న విధానంపై తగిన రీతిలో స్పందిద్దాం. ఈ సమయంలో మన నాయకులు, కార్యకర్తలు ఎంతో సంయమనం, సహనం పాటిస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నారు. సహృదయంతో సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. వ్యవసాయ రంగంలో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి” అన్నారు.

 

 

 

Similar News