పారదర్శక ఎన్నికల కోసమే ఆర్డినెన్స్

Update: 2020-04-18 15:36 GMT

రాష్ట్రంలో పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ‘ఎస్ఈసీ పదవీ కాలం తగ్గింపు, పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులను గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ తెచ్చాం. గవర్నర్ నిర్ణయం తర్వాత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్నికల కమిషనర్ సర్వీసు రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్ధాయిలో ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందే. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకునే ముందు మాజీ ఎస్ఈసీ రమేష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.

స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం మీడియా తర్వాతే ప్రభుత్వానికి చేరింది. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని ఈసీ ప్రకటించడం సరికాదు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చసిన పిటీషన్ కు సంబంధించి సర్కారు తరపున శనివారం నాడు కౌంటర్ దాఖలు చేశారు. తనను తొలగించడానికే ఆర్డినెన్స్‌ తొలగించారన్న మాజీ ఈసీ ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌శాఖ కార్యదర్శి ద్వివేదీ 24 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.

Similar News