ప్రపంచ యుద్ధాల కంటే ప్రమాదం కరోనా వైరస్

Update: 2020-03-19 15:39 GMT

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలో దేశ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడి సూచించారు.ఈ వైరస్ ప్రపంచ యుద్ధాల కంటే ప్రమాదకరణంగా పరిణమించిందని వ్యాఖ్యానించారు. అందరూ కలసి ఈ మహమ్మారిపై ఉమ్మడిగా పోరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు మందు కనిపెట్టలేదని..అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డాయన్నారు. అలాంటిది ఇది మనకు రాదు అనుకోవటానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు కొన్ని వారాల సమయాన్ని తన కోసం కేటాయించాలని కోరారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి ధృడ సంకల్పం, కలసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా దేశం ఎదుర్కొంటున్న ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్నారు. కరోనా వైరస్ ప్రపంచమంతటికీ వ్యాపిస్తోందన్న వార్తలను గత రెండు నెలలుగా మనమంతా ఆందోళనతో గమనిస్తున్నామన్నారు. ఈ వైరస్ బాధితులను ఏకాంత ప్రదేశంలో ఉంచి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనడం, తిప్పికొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కృషితోపాటు ప్రతి ఒక్కరి సంకల్పం ముఖ్యమని తెలిపారు. సామాజికంగా కట్టుబాట్లతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సామూహికంగా ఒక చోట చేరకుండా జాగ్రత్తపడాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే, దేశం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంగా ఉన్నవారు, కరోనా లక్షణాలు ఉన్నవారు జనంలో తిరిగితే, తమకు తామే అన్యాయం చేసుకున్నవారు అవుతారని, అంతేకాకుండా తమ కుటుంబాలకు, యావత్తు సమాజానికి అన్యాయం చేస్తున్నట్లేనని వివరించారు.

ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఎవరూ తమ ఇల్లు, సొసైటీ లేదా భవనం నుంచి బయటకు రావొద్దని చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా సంయమనం పాటించాలన్నారు. రాబోయే కొద్ది రోజులపాటు చాలా ముఖ్యమైన పని ఉంటేనే ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు రావాలని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు రెండు నెలలుగా పోరాడుతున్న వైద్యులు, అధికారులు, పారామెడికల్ సిబ్బందిని మార్చి 22న సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు అభినందించాలని మోదీ పిలుపునిచ్చారు. 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడంతో పాటు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేయాలన్నారు. ఇళ్ల తలుపుల వద్దనుంచి కానీ, బాల్కనీల నుంచి కానీ వీరికి తమ అభినందనలు తెలియాజేయాలని మోదీ సూచించారు. చప్పట్లు కొట్టడంతో పాటు గంటలు కొట్టవచ్చన్నారు. సెల్యూట్ చేయడం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

 

 

 

Similar News