లాక్ డౌన్ పొడిగింపు ఉండదు

Update: 2020-03-30 05:43 GMT

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులు గా దేశంలో లాక్ డౌన్ ను మరింత పొడిగించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సోమవారం నాడు స్పందించారు. లాక్ డౌన్ పొడిగింపు వార్తలు నిరాధారం అని ఆయన తోసిపుచ్చారు. ఈ ఊహాగానాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. ప్రస్తుతానికి కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1071కు చేరాయి. అదే సమయంలో మృతుల సంఖ్య 29కి చేరింది. అయితే లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇది తప్ప మరో మార్గంలేదని భావించిన కేంద్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేసింది. ఏప్రిల్ 14 వరకూ పరిస్థితులు చాలా వరకూ అదుపులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.

Similar News