మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఔట్..బిజెపి ఎంట్రీనే మిగిలింది!

Update: 2020-03-20 08:20 GMT

ఫిరాయింపులకు బదులు ఇప్పుడు ఇదో కొత్త ఫార్ములా. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొంత మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకోవటం.వారి ద్వారా రాజీనామా చేయించటం. తర్వాత మళ్ళీ రాజీనామాలు చేసిన వారికే అధికార పార్టీ టిక్కెట్ ఇచ్చి.గెలిపించుకుని..కొంత మందికి మంత్రి పదవులు, అందుబాటులో ఉన్న ఇతర పదవులు ఇవ్వటం. కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం ఇదే సీన్ చూశాం. ఇప్పుడు ఇదే మధ్యప్రదేశ్ లో అదే రిపీట్ అయింది. కర్ణాటకకు, మధ్యప్రదేశ్ కు మధ్య ఓ తేడా ఉంది. మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత అయిన జ్యోతిరాధిత్య సింధియా రాజీనామా చేయటం ...ఈ సంక్షోభానికి కారణం అయింది. ఆయన గ్రూప్ లోని 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో కమల్ నాధ్ సర్కారు సంక్షోభంలో కూరుకుపోయింది. అది కాస్తా శుక్రవారం నాడు క్లైమాక్స్ చేరింది. దీంతో బలపరీక్షకు ముందే సీఎం కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. సీఎంగా ‍ప్రమాణం చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేశారు.

గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కమల్‌నాథ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించారని ఆరోపించారు.

ఐదేళ్ల పాటు పరిపాలన చేయాలని ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారని, కానీ తనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రచేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది.

 

 

 

Similar News