కొలువుదీరిన కేజ్రీవాల్ సర్కార్

Update: 2020-02-16 07:51 GMT

ఢిల్లీలో ముచ్చటగా మూడవ సారి అరవింద్ కేజ్రీవాల్ సర్కారు కొలువుదీరింది. అందరూ ఊహించినట్లుగానే అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న ఆమ్ అద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆదివారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాంలీలా మైదానంలో ‘ ధన్యవాద్‌ ఢిల్లీ’ పేరుతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మనిష్‌ సిసోడియా, కైలేష్‌ గెహ్లాట్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, సత్యేంద్ర జైన్‌, గోపాల్‌ రాయ్‌, రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ శనివారం కేజ్రీవాల్‌ పిలుపునివ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది.

 

 

Similar News