నేను భయంకరమైన హిందువును.. సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తాం

Update: 2020-01-25 13:15 GMT

నేను చేసినన్ని యాగాలు ఎవరు చేశారు

బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ వ్యతిరేకం అని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు. రాజ్యంగ మౌలిక స్వరూపంలోనే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని...కానీ సీఏఏలో ముస్లింలను పక్కన పెట్టి చట్టం చేశారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుకు కేంద్రం కోరిన వెంటనే మద్దతు ఇచ్చామని..ఇదే దేశ ప్రయోజనాల కోసం కాబట్టి ఓకే చేశామన్నారు. కానీ సీఏఏపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేస్తే చాలా స్పష్టంగా తాము దీనికి మద్దతు ఇచ్చే ప్రశ్నలేదని తెలిపామన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని...ఇందులో ఎలాంటి రాజీపడేదిలేదన్నారు. సీఏఏపై, ఎన్ఆర్ సీపై కేంద్ర మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఏఏ బిల్లుపై చాలా మంది సీఎంలతో మాట్లాడానని తెలిపారు. త్వరలోనే దేశంలోని సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నెల రోజుల్లోనే ఇది హైదరాబాద్ లో జరుగుతుందని తెలిపారు.

దేశం పై హిందుమత దేశంగా మార్చేందుకు బీజేపీ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయని..అంతర్జాతీయంగా ఇది భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అన్నారు. దేశంలోని 16 మంది సీఎంలు సీఏఏకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కేంద్రమే స్వచ్చందంగా సీఏఏను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఎన్ ఆర్ సీ గురించి ఓ వైపు మాట్లాడుతూ మళ్లీ ఎన్ పీఆర్ అంటున్నారని..ఎన్ పీఆర్ ఎన్ఆర్ సీకి తొలి అడుగు అని పార్లమెంట్ కు ఇచ్చిన నివేదికలోనే ఉందని కెసీఆర్ తెలిపారు. తాము వీటిని వ్యతిరేకిస్తామని తెలిపారు. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసి..ఏమి పంచాయతీలు ఇవన్నీ అని కెసీఆర్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. నేను భయంకరమైన హిందువుని. నేను కాదా..హిందువును..నేను చేసినన్ని యాగాలు ఎవరైనా చేశారా?. నేను హిందువుని అని చెప్పుకోవటానికి భయపడతానా?. బిజెపి వాళ్లు చెపితేనే మంత్రాలు చదువుతానా?. కేంద్రానికి పనికిరాని దందా అని విమర్శించారు. సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టివేయాలన్నారు.

 

 

 

Similar News