యడ్యూరప్ప సర్కారుకు ఇక ఢోకా లేదు

Update: 2019-12-09 09:42 GMT

కర్ణాటకలోని బిజెపి సర్కారుకు ఇక నిశ్చింతే. తాజాగా జరిగిన 15 ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 12 సీట్లు దక్కించుకుని అప్రతిహత విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో బిజెపి సర్కారు సజావుగా ముందుకు సాగాలంటే ఆ పార్టీ ఉప ఎన్నికలు జరిగిన 15 సీట్లలో కనీసం ఆరు సీట్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. కానీ బిజెపి ఏకంగా 12 సీట్లు దక్కించుకోవటంతో బిజెపికి తిరుగులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను దక్కించుకోగా..జెడీఎస్ ఖాతా తెరవలేదు. ఒక సీటును ఇండిపెండెంట్ దక్కించుకున్నారు. కర్ణాటకలో కొలువుదీరిన యడ్యూరప్ప సర్కారును నిలబెట్టేందుకు కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

మరికొంత మంది కాంగ్రెస్, జెడీఎస్ సంకీర్ణ సర్కారుకు వ్యతిరేకంగా పనిచేయటంతో అప్పటి స్పీకర్ సురేష్ కుమార్ వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా ఇంత భారీ ఎత్తున ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఫిరాయింపుదారులే మళ్లీ బిజెపి టిక్కెట్లపై పోటీ చేసి గెలుపొందటం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించింది. ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 105 సీట్లు. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోవటంతో ఈ సంఖ్య 117కి చేరింది. దీంతో యడ్యూరప్ప సర్కారు మూడున్నర సంవత్సరాల పాటు నిశ్చింతగా ఉండొచ్చన్న మాట.

 

Similar News