పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Update: 2019-12-11 16:16 GMT

అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసేందే. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 117 మంది సభ్యులు, వ్యతిరేకంగా 92 మంది సభ్యులు ఓటు వేశారు. ఉభయ సభలు ఆమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ చట్టం అమలులోకి రానుంది. ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, బుద్ద, జైన్‌, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుంది. అంతకుముందు ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలా వద్దా అన్నదానిపై రాజ్యసభలో ఓటింగ్‌ నిర్వహించారు.

సెలెక్ట్‌ కమిటీకి పంపాలని 99 మంది, పంపొద్దని 124 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం బిల్లుపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు కూడా వీగిపోయాయి. అయితే లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఓటింగ్‌ జరుగుతన్న సమయంలో శివసేన సభ్యులు సభలో నుంచి వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. టీఆర్ఎస్ తోపాటు ఎంఐఎం వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి.

 

 

 

Similar News