ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. ఓ వైపు పార్లమెంట్ లో మోడీ సర్కారు పెట్టిన బిల్లుకు మద్దతు ఇస్తూనే మరో వైపు బయట మాత్రం అందుకు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్ సీ)ని ఏపీలో అమలు చేయబోమని ప్రకటించి సంచలనం సృష్టించారు. కానీ ఇదే బిల్లుకు జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ పార్లమెంట్ లో మాత్రం మద్దతు ఇచ్చింది. వ్యతిరేకించేట్లు అయితే పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించాలి కదా?. పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి బయట మాత్రం అందుకు భిన్నమైన వైఖరి తీసుకోవటం వెనక మతలబు ఏమిటి? ఇవి ద్వంద ప్రమాణాలు కావా?. సోమవారం నాడు కడపలో జరిగిన పలు కార్యక్రమాల్ల పాల్గొన్న జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పూర్తిగా ఎన్ ఆర్ సీని వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు.
ముస్లింలు ఎన్ ఆర్ సీపై ఆందోళన వ్యక్తం చేయగా..బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్ కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్‌ఆర్‌సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు.