సడక్ బంద్ వాయిదా...సమ్మెపై మంగళవారం తుది నిర్ణయం

Update: 2019-11-18 13:48 GMT

ఆర్టీసీ జెఏసీ మంగళవారం నాడు తలపెట్టిన సడక్ బంద్ ను వాయిదా వేసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించిన తర్వాత సమ్మె విషయంపై తుది నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. మంగళవారం ఉదయం జెఏసీలోని కార్మిక సంఘాలు తమ తమ సమావేశాలు పెట్టుకోనున్నాయని..అందరం కలసి తుది నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. మంగళవారం మాత్రం నిరసన కార్యక్రమాలు ఎప్పటిలానే ఉంటాయన్నారు. సోమవారం సాయంత్రం జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, మరో నేత రాజిరెడ్డిలు తాము చేస్తున్న నిరవధిక దీక్ష విరమించారు. విపక్ష నేతలు వీరికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న వీరిద్దరూ హైకోర్టు తీర్పు, విపక్ష నేతల సూచనల నేపథ్యంలో దీక్ష విరమించారు.

అంతకు ముందు టీజెఎస్ అధినేత కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సామరస్యపూర్వకంగా సమ్మె పరిష్కారం కోసం తాము చేసిన సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అందరం కలసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం అయినా విధుల్లో చేరే ఉద్యోగులను వేధించకుండా సామరస్యపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సాఫీగా చర్చలు సాగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు తమ డిమాండ్లను రెండు వారాల్లో పరిశీలించాల్సిందిగా కార్మిక శాఖ కమిషనర్ ను కోరినందున భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

Similar News