ఏపీలో ‘కడుపుమండితే’ ఎవరిపైనైనా రాళ్ళు వేయోచ్చా?

Update: 2019-11-29 10:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొత్త రూల్ అమల్లోకి వచ్చినట్లు ఉంది?. కడుపు మండితే..ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోతే బాధితులు రాళ్ళు, చెప్పులు వేయటం భావ ప్రకటనా స్వేచ్చ కిందకు వస్తుందా?. సాక్ష్యాత్తూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటన గురించి మాట్లాడుతూ చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేసిన వారిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ‘గతంలో చెప్పిన మాటలకు మోసపోయి, విసిగిపోయి దాడిచేశామని నిందితులు చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. నిరసన తెలపటం, భావప్రకటనా స్వేచ్చ, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి కల్పించిందని వ్యాఖ్యానించారు. డీజీపీ గౌతంసవాంగ్ చెప్పిన దాని ప్రకారమే తీసుకుంటే రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో చెప్పేది ఒకటి..అధికారంలోకి వచ్చాక చేసేది మరోకటి. మరి అలాంటప్పుడు మాట మార్చినందుకు ఇలా ఎవరు చేసినా చెప్పులు, రాళ్ళు వేయటం తప్పేమీకాదని చెప్పదలచుకున్నారా?. ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీసేలా ఉన్నాయని ఏపీలో ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబుపై రాళ్ళు, చెప్పులు వేయటానికి కిరాయి రౌడీలు అవసరమా?. ఎవరో కడుపు మండినవాడు రాయి, చెప్పు వేసి ఉంటాడని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రకటనల ద్వారా అటు డీజీపీ, ఇటు అంబటి రాంబాబు ఏమి చెప్పదల్చుకున్నారన్నది అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కొన్ని నెలల పాటు ఇసుక దొరకక ప్రజలు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పై కూడా ఎవరైనా ఇలాగే దాడి చేస్తే ఇదే తీరుగా డీజీపీ సమర్దిస్తారా? అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. మాట తప్పినందుకు, హామీలు అమలు చేయనందుకు ప్రజలు ఇలా రాళ్ళతో దాడులు చేయటం ప్రారంభిస్తే రోడ్లపై ఎవరూ తిరగలేరని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షలు ఉంటే వేరే రకంగా చూసుకోవాలి కానీ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతుందో సూచిస్తుందని ఐఏఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

 

Similar News