మహా ట్విస్ట్..ఎవరి ఊహాకు అందని రాజకీయ మలుపు. అదే సమయంలో బిజెపి ఇచ్చిన సూపర్ మాస్టర్ స్ట్రోక్. కనీసం ఎక్కడా ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కూడా కన్పించకుండా అంతా చేసేసింది బిజెపి. ఈ మహా నాటకంలో రాజకీయంగా ఎవరు గెలిచారు..ఎవరు ఓడారు అనే విషయాన్ని కాసేపు పక్కడ పెడితే తాజా నిర్ణయం ద్వారా ఎన్సీపీ పార్టీ కానీ..ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సాధించింది ఏమిటి?. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కారు ఏర్పాటు అయితే కూడా ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవే వచ్చేది. ఆ పదవి కూడా అజిత్ పవార్ కే అన్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపితో కలవటం ద్వారా ఎన్సీపీ అదనంగా సాధించింది ఏమిటి?. ఆ పార్టీ అధినేత నేత శరద్ పవార్ పరువు పోవటం తప్ప. ఇవే పదవులు సంకీర్ణ కూటమి సర్కారులో కూడా వచ్చేవి. ఓ వైపు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ కు ఇది ఎంత అవమానం. దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరైన పవార్ కు ఖచ్చితంగా ఇది ఓ మరకలాంటిదే అని చెప్పకతప్పదు.
అజిత్ పవార్ నిర్ణయం తనకు తెలియదని..ఆ నిర్ణయం ఎన్సీపీ నిర్ణయం కాదని శరద్ పవార్ ప్రకటిస్తున్నా కూడా అది అంత నమ్మశక్యంగా లేదనే చెప్పాలి. ఓ పార్టీ అధినేతకు కనీసం మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇది జరుగుతుందా?. ఏకంగా 54 మందిలో ఒక్కరు కూడా ఆయన వర్గం వారే లేరా?. అంతా అజిత్ పవార్ వైపై ఉన్నారా?. అంటే ఇప్పుడు ఎన్సీపీలో శరద్ పవార్ కంటే అజిత్ పవారే శక్తివంతమైన నేత అని అందరూ నమ్మాలా?. శివసేన ఆరోపిస్తున్నట్లు తెరవెనక ఏవో బలమైన కారణాలు ఉండి ఉంటాయి. అలాంటిది ఏమీ లేకుండా ఎన్సీపీ అదే ఉప ముఖ్యమంత్రి, కొన్ని మంత్రి పదవుల కోసం బిజెపికి మద్దతు ఇస్తుందని నమ్మటం అంటే ఒకింత కష్టమైన పనే. పైగా గత ఎన్నికల్లో కలసి పోటీచేసిన మిత్రపక్షం కాంగ్రెస్ కు ఓ మాట కూడా చెప్పకుండా ఎన్సీపీ ఇంత ధోకా చేయటం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. మరి తెరవెనక ఏమి జరిగిందో ఎప్పుడు తేలుతుంది?. మహారాష్ట్రలో సీఎం పీఠంపై కూర్చోవాలని ఎంతో ఆశపడిన శివసేన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో వేచిచూడాల్సిందే.