సీఎం కోసం 191 కోట్లతో ప్రత్యేక విమానం

Update: 2019-11-18 07:41 GMT

దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘ప్రత్యేక విమానాలు’ లేకుండా ఈ మధ్య ప్రయాణమే చేయటం లేదు. ఒకప్పుడు సీఎంలు అందరూ షెడ్యూల్డ్ విమానాల్లోనే రాకపోకలు సాగించే వారు. రాష్ట్రంలో పర్యటనల కోసం అయితే హెలికాఫ్టర్లు వాడేవారు. కానీ ముఖ్యంగా గత ఐదారేళ్ళుగా ముఖ్యమంత్రులు ‘ప్రత్యేక విమానాలు’ లేకుండా అడుగు ముందుకు వేయటం లేదు. ఏపీకి సంబంధించిన విషయానికి వస్తే గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పర్యటనల కోసం ప్రత్యేక విమానాలను విరివిగా వాడారు. కోట్లాది రూపాయలు దీని కోసం ఖర్చు చేశారు. కొన్నిసార్లు అయితే ఏకంగా విదేశాలకు సైతం ప్రత్యేక విమానంలో వెళ్లి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు ప్రత్యేక విమానాల వాడకాన్ని విమర్శించిన ప్రస్తుత సీఎం జగన్ కూడా తరచూ తన పర్యటనల కోసమే ప్రత్యేక విమానాలనే ఉపయోగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక విమానాల వాడకాన్ని విమర్శించిన ఆయన ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

తన పర్యటన ఎక్కడికి అయినా ‘ప్రత్యేక విమానమే’ వాడుతున్నారు. తాజాగా బిజెపి పాలిత రాష్ట్రం, ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఏకంగా 191 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేశారు. అయితే ఈ విమానాన్ని సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, గవర్నర్ ల కోసం ఉపయోగిస్తామని చెబుతున్నారు. అయితే గుజరాత్ ప్రభుత్వం 191 కోట్ల వ్యయంతో విమానం కొనుగోలు చేయటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ కూడా మండిపడింది. అయితే ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. గుజరాత్ లో వివిఐపిల అవసరాల కోసం 12 సీట్లు ఉన్న రెండు ఇంజన్లతో కూడిన బంబార్డియర్ ఛాలెంజర్ 650 ఎయిర్ క్రాఫ్ట్ ను కొనుగోలుచేసింది.

తాజాగా గుజరాత్ సీఎం విమాన వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపి నేతలపై ఫైర్ అయ్యారు. బిజెపి సీఎంలు తమ అవసరాల కోసం 191 కోట్ల రూపాయలు పెట్టి విమానాలు కొనుక్కొంటారు కానీ..తాము ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే మాత్రం విమర్శలు చేస్తారా? అంటూ అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఎంపీలు ఉచితంగా నాలుగు వేల యూనిట్ల విద్యుత్ వాడుకోవచ్చు కానీ..తాము 200 యూనిట్లు ప్రజలకు ఉచితంగా ఇస్తే మాత్రం తప్పుపడతారా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆప్ ఢిల్లీ ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారని బిజెపి విమర్శలు చేస్తోంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఈ విమానం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.

 

Similar News