కెసీఆర్ కు పవన్ కళ్యాణ్ సూచన

Update: 2019-11-20 16:46 GMT

ఆర్టీసీ కార్మికుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. జెఏసీ నేతల ప్రకటన తర్వాత ఆయన సీఎం కెసీఆర్ కు ఓ సూచన చేశారు. ఆర్టీసీ కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. షరతులు పెట్టకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని టీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్టీసీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమ పార్టీ ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులు తనను కోరారని తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌ను పవన్ కోరారు. నలభై రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కార్మికులందరూ విధుల్లో చేరాక సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలని కేసీఆర్‌కు పవన్ విజ్ఞప్తి చేశారు.

 

Similar News