మహారాష్ట్రలో కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్స్

Update: 2019-11-01 09:48 GMT

అక్కడ సాఫీగా సర్కారు ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. హర్యానాలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందో అని తర్జనభర్జన పడ్డారు. కానీ హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు అంతా కూల్ గా సాగిపోయింది. కూల్ గా సాగిపోతుందని అనుకున్న మహారాష్ట్రలో పొలిటికల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిజెపి మిత్రపక్షం శివసేన ఏ మాత్రం రాజీ లేకుండా ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతోంది. దీంతో బిజెపికి పెద్ద ఇరకాట పరిస్థితి ఎదురవుతోంది. శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. ‘మీ అహంకారం మా వద్ద చూపించకండి. అలెగ్జాండర్ వంటి ఎంతో మంది కాలగర్భంలో కలసిపోయారు’ అంటూ ట్వీట్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాసిపెట్టుకోండి ఉద్ధవ్ ఠాక్రే ఒక్క మాట చెపితే చాలు మహారాష్ట్రలో శివసేన ముఖ్యమంత్రి ఉంటారు అని వ్యాఖ్యానించారు.శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అందుకు తగినంత మంది ఎమ్మెల్యేలను శివసేన పొందగలదన్నారు. మెజారిటీ లేని వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని తెలిపారు. 50-50 ఫార్ములాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారని..శివసేన నుంచే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన ఫార్ములాను బిజెపి గట్టిగా వ్యతిరేకిస్తోంది. మరి చివరకు ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో వేచిచూడాల్సిందే.

 

Similar News