బిజెపిపై శివసేన సంచలన వ్యాఖ్యలు

Update: 2019-10-29 07:15 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలో నిలిచిన బిజెపి, శివసేనల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అది కాస్తా రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం అధికారం ఫిఫ్టీ..ఫిఫ్టీ అంటూ శివసేన పట్టుబడుతోంది. బిజెపి మాత్రం ముఖ్యమంత్రిగా తమ అభ్యర్ధే ఉంటారని..ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం శివసేనకు ఇస్తామని ఆపర్ చేస్తోంది. అయితే ఇది ఎంతకూ తెగటంలేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం నాడు మహారాష్ట్ర వస్తుండటంతో అప్పుడు ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే శివసేన మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా బిజెపిని టార్గెట్ చేస్తోంది. హర్యానాలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి మరింత కలకలం రేపుతున్నాయి. ‘ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్‌ ఎవరూ ఇక్కడ లేరు’ అంటూ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో విజయం సాధించింది.

తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మరాఠా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. బిజెపిని ఏ మాత్రం లెక్కచేయకుండా శివసేన తాము అవసరం అయితే కాంగ్రెస్‌- ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు జారీ చేస్తోంది. ఈ తరుణంలో శివసేన ఎంపీ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘ బీజేపీ, మేము ఉమ్మడిగానే ఎన్నికలకు వెళ్లాం. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మేము ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించుకునే విధంగా బీజేపీ మాతో పాపం చేయించకూడదు. రాజకీయంలో సన్యాసులు ఎవరూ ఉండరు. మేము ధర్మబద్ధమైన, నిజాయితితో కూడిన రాజకీయాలే చేస్తామన్నారు.

 

 

 

 

 

Similar News