ఏపీలో మంత్రులకు ఇసుక సెగ

Update: 2019-10-26 05:51 GMT

ఏపీలో ఇసుక కొరత వ్యవహారం సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో విధాన నిర్ణయం అంటూ కొన్ని నెలల పాటు ఇసుక లేకుండా చేశారు. తర్వాత ఓ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినా ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాలు..వరదల కారణంగా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీలో ఓవరాల్ గా నిర్మాణ రంగం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీతోపాటు జనసేన కూడా రంగంలోకి దిగి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. శనివారం నాడు గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

ఓట్లు వేసి గెలిపిస్తే ఇసుక లేకుండా చేసి తమకు పనులు లేకుండా చేశారని కార్మికులు మంత్రుల ఎదుట తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో మరో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. నిర్మాణ రంగానికి ఇసుక సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ నదుల్లో నీరు ఉండటం వల్లే ఇసుక సరఫరా ఆగిపోయిందని..వీలైనంత త్వరగా ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 

 

Similar News