చంద్రబాబు. కన్నాలకు పవన్ కళ్యాణ్ ఫోన్

Update: 2019-10-30 10:55 GMT

ఇసుక విషయంలో ఏపీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ప్రకటించిన ఆ పార్టీ ఇందులో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి ఆహ్వానించారు. సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణతో పాటు తులసిరెడ్డికి ఫోన్లు చేశారు. పవన్ కళ్యాణ్ వినతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సానుకూలంగానే స్పందించారని జనసేన వెల్లడించింది. అయితే వామపక్షాలు మాత్రం పార్టీలో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆహ్వానానికి కన్నా సూత్రప్రాయంగా ఆమోదించారని జనసేన తెలిపింది. వీరిద్దరి చర్చల సందర్భంగా లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను వివరించారని తెలిపారు. ఆగస్టు 4న భీమవరం సమావేశంలో పాల్గొనడానికి రాజమండ్రి నుంచి వెళుతున్న సందర్భంలో సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని ఆపి తమ కష్టాలను తెలిపారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక దొరక్క కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మంగళగిరి వెళ్ళినప్పుడల్లా భవన నిర్మాణ కార్మికులు వచ్చి కలుస్తూనే ఉండటంతో తమ సమస్యలు ఏకరువు పెట్టారని తెలిపారు. కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారం అవుతుందన్న కొంత ఆశ ఉండేదని.. అయితే రాను రాను సమస్య మరింత తీవ్రతరమై ఇసుక అందరాని సరుకుగా మారిపోయి చివరకు ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి చేరటం ఆందోళనకర అంశంగా మారిందన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీ గారి దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారని జనసేన వెల్లడించింది. అన్ని పార్టీల నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవను ప్రశంసించారని వెల్లడించారు.

Similar News