శివసేన దూకుడును బిజెపి పెద్దగా పట్టించుకోవటం లేదా?. అంటే ఔననే సంకేతాలు అందుతున్నాయి. తానే సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ఫడ్నవీస్ స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సమయంలో శివసేనకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వటంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పు తమ పార్టీకే అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రతిభ ఆధారంగానే పదవుల కేటాయింపు ఉంటుందని ఆయన మంగళవారంనాడు స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.
ఐదేళ్ల పాటు సమర్ధవంతమైన పాలనను బీజేపీ మాత్రమే అందించగలదని చెప్పారు. శివసేన 'సామ్నా' సంపాదకీయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 50-50 ఫార్ములాపై చర్చ లేదని, కేవలం ప్రతిభ ఆధారంగా పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి వంటి కీలక పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునే విషయంపై కూడా చర్చ ఉండదని ఆయన సమధానమిచ్చారు. 'మరోసారి నేను సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం' అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. శివసేన మాత్రం చాలా దూకుడు చూపుతుంది. మరి ఫడ్నవీస్ మాటలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.